: 4,500 మంది ఉద్యోగులను తొలగించనున్న బ్లాక్ బెర్రీ
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మొబైల్ ఫోన్ల కంపెనీ 'బ్లాక్ బెర్రీ' 4,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. బ్లాక్ బెర్రీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది మూడో వంతుకు సమానం. ఈ త్రైమాసికంలో ఆపరేటింగ్ లాస్ రూపంలో భారీ నష్టాలను అంచనా వేస్తున్నట్టు బ్లాక్ బెర్రీ సంస్థ టొరంటోలో ప్రకటించింది. ఈ నష్టాలనుంచి బయటపడాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపింది. ఇందులో భాగంగా ఉద్యోగులపై వేటు తప్పదని తెలిపింది.
బ్లాక్ బెర్రీ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా యాపిల్ 'ఐఫోన్లు', శాంసంగ్ 'గెలాక్సీ' ఫోన్లతో తీవ్రమైన పోటీ ఉంది. ఈ రెండు కంపెనీలు స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో బ్లాక్ బెర్రీని వెనక్కినెట్టి దూసుకుపోతున్నాయి. ఈ రెండు కంపెనీల దెబ్బకు బ్లాక్ బెర్రీకి ఆగస్టు 31తో ముగియనున్న త్రైమాసికంలో దాదాపు 995 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో టొరంటో స్టాక్ మార్కెట్ తో పాటు, అమెరికా నాస్ డాక్ లో బ్లాక్ బెర్రీ షేర్లు 23 శాతం వరకు పతనమయ్యాయి.