: ఎయిడ్స్‌ను అడ్డుకునే పుట్టగొడుగులు!
పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. నిజానికి ఎంతో పురాతన కాలంనుండి మనవాళ్లు పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా వాడుతున్నారు. వీటిలోని ప్రయోజనాలను పరిశీలించిన తర్వాత వాటిని మరింత ఎక్కువగా వాడితే మేలేనంటున్నారు. అయితే సైబీరియా ప్రాంతాల్లో పెరిగే ఒక రకమైన పుట్టగొడుగులు ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సైబీరియా ప్రాంతంలో పెరిగే ఒక రకమైన పుట్టగొడుగులు స్మాల్‌పాక్స్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లను సమర్ధవంతంగా అడ్డుకోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇవి ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి కారక వైరస్‌ను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైబీరియా ప్రాంతాల్లో పెరిగే 'చాగా' అనే రకానికి చెందిన పుట్టగొడుగులతో మందులను తయారుచేయడంపై దృష్టి సారించిన రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు వీటిలోని ఔషధగుణాలను గుర్తించారు. అయితే ఈ పుట్టగొడుగులకు ఎయిడ్స్ వ్యాధిని కూడా నయం చేయగలిగే శక్తి ఉందనే విషయానికి సంబంధించి ఇంకా ఎలాంటి పరీక్షలు జరగలేదని మరికొందరు శాస్త్రవేత్తలు ఈ ప్రకటనను ఖండిస్తున్నారు. అయితే వీటిలోని బెటులినిక్ యాసిడ్ కొన్ని రకాలైన క్యాన్సర్లపైనా, కొన్ని రకాలైన వైరస్‌లపైన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.