: దీంతో హెచ్‌ఐవీకి చెక్ చెప్పవచ్చు!
హెచ్‌ఐవీ వ్యాధి వ్యాపించిన తర్వాత దాన్ని నిర్మూలించడం అనేది అసాధ్యం... కేవలం అదుపులో ఉంచడమే జరుగుతుంటుంది. అయితే మన శరీరంలోకి ప్రవేశించిన హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టగల సామర్ధ్యం మన శరీరంలోనే ఉండే ఒక ప్రత్యేకమైన జన్యువుకు ఉందట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యువు ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీ వ్యాప్తిని అడ్డుకునే సామర్ధ్యం గల కొత్త జన్యువును గుర్తించారు. ఈ జన్యువు శరీరంలోకి ప్రవేశించిన హెచ్‌ఐవీ వ్యాధి వ్యాప్తిని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. ఈ జన్యువు గుర్తింపు వల్ల హెచ్‌ఐవీకి సమర్ధవంతమైన, తక్కువ దుష్ఫ్రభావాలతో కూడిన చికిత్సల రూపకల్పనకు చక్కగా ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శరీరంలోని ఎంఎక్స్2 అనే కొత్త జన్యువు చూపే ప్రభావాలను శాస్త్రవేత్తలు ఇటీవల ప్రయోగశాలలో అధ్యయనం చేశారు. వీరి అధ్యయనంలో ఈ జన్యువు వ్యక్తమైన కణాల పొరల్లో హెచ్‌ఐవీ వృద్ధి ఆగిపోయినట్టు గుర్తించారు. ఈ విషయాలను గురించి ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన ప్రొఫెసర్ మైక్ మాలిమ్ మాట్లాడుతూ ఈ విషయం చాలా ఆసక్తికరమైందని, మన రోగనిరోధకశక్తితోనే హెచ్‌ఐవీ కలిసిపోతుంది అనేది తెలుసుకోవడానికి ఇది చక్కగా తోడ్పడుతుందని, తాము కనుగొన్న విషయం సరికొత్త చికిత్సల రూపకల్పనకు దోహదం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.