: ఇక్కడ ఉన్నవారు దళితులు కాదా?:మంద కృష్ణ కు వెంకటేశ్వర్లు ప్రశ్న
'కేవలం తెలంగాణలో ఉన్నవారే దళితులా? సీమాంధ్రల్లో ఉన్నవారు దళితులు కారా?' అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, దళితనేత మంద కృష్ణ మాదిగను సీమాంధ్రకు చెందిన ఎమ్మార్పీఎస్ దళిత నేత వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విజయవాడలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ, దళితుల ముసుగులో తెలంగాణకు ముఖ్యమంత్రి అవుదామన్న అత్యాశతో, అంబేద్కర్ చెప్పారంటూ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్న మంద కృష్ణ ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. రిజర్వేషన్లలో అన్ని ప్రాంతాల, పార్టీల నాయకులు తమతో కలసి వచ్చారన్న విషయాన్ని గుర్తించాలని మంద కృష్ణకు ఆయన గుర్తుచేశారు. రెండు ప్రాంతాల్లో ఉన్న దళితులు తెలుగువారేనన్న విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలని, ఏపీఎన్జీవోల సభకు ఆటంకం కలిగించి సీమాంధ్రల్లో తిరగగలవా? అంటూ ఆయనను హెచ్చరించారు. 'ప్రకటనలు చేయడం కాదు, చేతనైతే ఇక్కడ సభ పెట్టి చూడు' అంటూ వెంకటేశ్వర్లు సవాలు విసిరారు.