: తెలంగాణ ప్రజలకు వ్యవసాయాన్ని, విద్యను నేర్పింది సీమాంధ్రులు కాదా?: చలసాని శ్రీనివాస్
కేసీఆర్ చెప్పేవన్నీ అవాస్తవాలే అని చలసాని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రులు నీళ్లు, కరెంటు, సంపద దొచుకున్నారని చెబుతున్నారని, అది అవాస్తవమని స్పష్టం చేశారు. 'అంతర్జాలంలో కనీస పరిజ్ఞానం ఉంటే వెతకండి... వాస్తవాలు తెలుసుకోండి' అంటూ ఆయన హితవు పలికారు. రాయలసీమలోని వజ్రాలను దోచుకున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వ్యవసాయాన్ని, విద్యను నేర్పింది సీమాంధ్రులు కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఒక్కరైనా తెలంగాణ వారు సీమాంధ్రులకు విద్య నేర్పారా? వ్యవసాయం నేర్పారా? మరి ఎవరు ఎవర్ని అభివృద్ధి చేశారు? ఎవరు ఎవర్ని దోచుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఏమాత్రం అవగాహన లేని కేసీఆర్, దిగ్విజయ్ సింగ్ లు 'కోస్తా తీరం సీమాంధ్రులకు ఉంది' అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, సముద్రం, వనరులు, చట్టాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోండంటూ సలహా ఇచ్చిన కేసీఆర్ వల్ల భవిష్యత్తులో ఆక్కడి ప్రజలకు కూడా ముప్పు ఉందని ఆయన సూచించారు.
నీటి యుద్థాల వల్ల తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని అన్నారు. ఉద్యోగాలు దోచుకున్నారంటూ కేసీఆర్ గంటల తరబడి చెప్పిన మాటే చెబుతూ, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులు సోనియా ఇంటి ముందు ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. 1957లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఎవరూ పోటీ చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఐదు దేశ భాషలకు తెలుగు భాషే మూలం అన్నారు. గుడారాల్లో ఉన్నారని ఆంధ్రులను అవమాన పరుస్తున్నారని, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.