: మన ఘ్రాణశక్తి అమోఘం
మన ముక్కు వాసనను ఇట్టే గుర్తుపట్టేస్తుంది. వంటింట్లో నుండి ఎలాంటి వాసన వస్తోంది... ఏం వంటకాలు ఇంట్లో తయారవుతున్నాయి? వంటివి మన ముక్కు ఇట్టే పట్టేసి మనకు తెలియజేసేస్తుంది కదూ. అసలు మన ముక్కు పదిరకాలైన వాసనలను ఇట్టే గుర్తుపట్టేస్తుందట. అంతేకాదు... వివిధ వాసనల్లోని తేడాలను కూడా మన ముక్కు పసిగట్టేస్తుందట. ఈ విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెబుతున్నారు.
పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా నిర్వహించిన అధ్యయనంలో మనిషి ముక్కు మౌలికమైన వాసనలను గుర్తించడంతోబాటు వాటిలోని వ్యత్యాసాలను కూడా గుర్తిస్తుందని తేలింది. మన ముక్కు వివిధ రకాలైన పండ్ల సువాసనలు, రసాయనాలు, పుదీనా, పాప్‌కార్న్, తీపి రుచికలిగిన వస్తువులు, నిమ్మ సువాసనలు వీటితోబాటు ఘాటైన పలు వాసనలు, పాడైపోయిన వస్తువుల తాలూకు దుర్వాసనలను కూడా గ్రహిస్తుందట. అయితే ఇన్ని రకాలైన వాసనలున్నా కూడా వాటిని పది కేటగిరీలుగా పేర్కొనవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.