: 4 రాష్ట్రాల్లో 3 బీజేపీవే : టైమ్స్ నౌ, సీ ఓటర్ పోల్స్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అంతా కలిసొచ్చేలా కనిపిస్తోంది. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగర వేస్తుందని టైమ్స్ నౌ, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తెలిపింది. రాజస్థాన్ లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతవుతుందని తేల్చింది. ఢిల్లీలో మాత్రం పోటీ హోరాహోరీగా ఉంటుందని... హంగ్ అసెంబ్లీకి అవకాశాలున్నాయని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు కార్యరూపం దాలిస్తే... మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో మోడీ ప్రభంజనం ఖాయమని సర్వే తెలిపింది.
సర్వే వివరాల్లోకి వెళితే....
ఢిల్లీలో అధికారానికి అవసరమైన 36 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోలేదని ఓటర్లు అభిప్రాయపడ్డారు. 70 అసెంబ్లీ సీట్లకు గానూ కాంగ్రెస్ 29, బీజేపీ 30 సీట్లను గెలుచుకోనున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 7 సీట్లు, బీఎస్పీ 2 సీట్లను, ఇతరులు 2 సీట్లను గెలుచుకుంటాయని సర్వే అంచనా వేస్తోంది. దీంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ ఏ పార్టీకి రాబోవడం లేదు. కాబట్టి ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడనుంది.
ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే... ఇక్కడ బీజేపీ తన అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోనుంది. సర్వే ప్రకారం ఇక్కడి ఓటర్లు బీజేపీకి ఈ పర్యాయమూ క్లియర్ మెజారిటీ ఇవ్వనున్నారు. మొత్తం 230 సీట్లకు గానూ బీజేపీకి 130 సీట్లు రానుండగా, కాంగ్రెస్ కి కేవలం 84 మాత్రమే రానున్నాయి. బీఎస్పీకి 5 సీట్లు దక్కుతాయని, ఇక 11 మంది ఇండిపెండెంట్లకు ఓటర్లు పట్టం కట్టనున్నారని సర్వే చెబుతోంది.
చత్తీస్ ఘడ్ లో... మొత్తం 90 సీట్లకు గానూ, బీజేపీ 47 సీట్లను గెలుచుకోనుంది. 2008తో పోలిస్తే కొద్దిగా మెజారిటీ తగ్గినప్పటికీ... బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ఎలాంటి అవరోధాలు లేవని సర్వే తెలిపింది.
రాజస్థాన్ విషయానికొస్తే... ఈసారి ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ పాలనకు చమరగీతం పాడనున్నారు. 200 శాసనసభ సీట్లకు గానూ బీజేపీ 118 సీట్లను గెలుపొంది క్లియర్ మెజారిటీ సాధించనుంది. కాంగ్రెస్ కేవలం 64 సీట్లకు మాత్రమే పరిమితం కానుంది. బీఎస్పీ 3 సీట్లను దక్కించుకుంటుందని సర్వే తెలిపింది 15 మంది ఇండిపెండెంట్లు గెలుపొందనున్నప్పటికీ... వీరికి అంత ప్రాధాన్యత ఉండదు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే... చత్తీస్ గఢ్ లో తప్ప, మిగతా రాష్ట్రాల్లో బీఎస్పీ అభ్యర్థులు శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఢిల్లీలో ఇద్దరు, రాజస్థాన్ లో ముగ్గురు, మధ్యప్రదేశ్ లో ఐదు మంది అభ్యర్థులు గెలవనున్నారు. వీరి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో... ప్రభుత్వ ఏర్పాటులో వీరి పాత్ర ఏమాత్రం ఉండబోవటం లేదు.