: తెగిన వేలు మళ్లీ పుట్టింది!


వేలు పొరబాటున తెగిపోయింది... దాని స్థానంలో కొత్త వేలు పుట్టుకొస్తే... ఇదేమన్నా అమరశిల్పి జక్కన సినిమానా... తెగిన చేయి స్థానంలో కొత్త చేయి రావడానికి అనుకుంటున్నారా... అయితే నిజంగానే అలా తెగిన వేలు స్థానంలో కొత్త వేలు పుట్టుకొచ్చింది. అలాంటి కొత్త రకం ప్రయోగాన్ని ఒక వైద్యుడు చేశాడు. ఆయన చేసిన ప్రయోగం చక్కగా విజయవంతం అయ్యింది. తెగిన వేలు స్థానంలో కొత్తగా వేలు పుట్టుకొచ్చింది. దీంతో సదరు వేలు పోయిన వ్యక్తి ఆనందం వర్ణనాతీతంగా ఉంది.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన పాల్‌ హాల్‌పెర్న్‌ తన గుర్రానికి దాణా తినిపిస్తున్నాడు. ఈ పనిలో ఉండగా సదరు గుర్రం తన యజమాని వేలును దాణాతోబాటు కొరికేసింది. లబోదిబోమని మొత్తుకుంటూ తెగిన వేలును తీసుకుని పాల్‌ ఆసుపత్రికి వెళ్లాడు. దాన్ని తిరిగి అతికించలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో పాల్‌ డీర్‌ఫీల్డ్‌ బీచ్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ యూజినో రోడ్రిగ్యూయెజ్‌ అనే డాక్టరు కొత్త పద్ధతిలో తెగిన వేలును తిరిగి పుట్టేలా చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం జెనోగ్రాఫ్ట్‌ పద్ధతిని ఉపయోగించాడు. ఇతర జాతుల నుండి తీసిన కణాలను మార్పిడి చేయడం అనేది ఈ పద్ధతి ప్రత్యేకత.

రోడ్రిగ్యూయెజ్‌ ముందుగా పంది మూత్రాశయం నుండి తీసిన కణజాలంతో వేలి ఆకారంలో ఒక చట్రాన్ని తయారుచేశాడు. దాన్ని తెగిపోయిన వేలు భాగంలో అతికించారు. పంది మూత్రాశయం నుండి తీసిన కణాలను పొడిరూపంలోకి మార్చి, దాన్ని రోజూ వేలుపై అద్దాలని, అలాగే రోజూ జాగ్రత్తగా దానిపై కట్టు కట్టాలని పాల్‌కు సూచించారు. మొత్తానికి హాల్‌పెర్న్‌ డాక్టరు చెప్పినట్టు చేశాడు. కొద్దిరోజులకు అక్కడ కొత్త ఎముక, మృదుకణజాలం, గోరుతో కూడిన కొత్త వేలు పుట్టుకొచ్చింది. పంది కణాల పొడి వేలిలోని మూలకణాలను ప్రేరేపించి కొత్తవేలు పుట్టుకురావడాన్ని ప్రేరేపించిందని డాక్టర్‌ రోడ్రిగ్యూయెజ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News