: ఎప్పుడో వచ్చే రోగాన్ని ఇప్పుడే గుర్తించవచ్చు!
భవిష్యత్తులో వచ్చే రోగాన్ని ఇప్పుడే గుర్తించగలిగితే... దానికి అనుగుణంగా ఇప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కాలంలో రాబోయే రోగాన్ని ఇప్పుడే నివారించవచ్చుకదా... ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక బయోమార్కర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బయోమార్కర్‌తో ముందుకాలంలో మనకు మధుమేహం వస్తుందో రాదో అంచనా వేసి చెప్పవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మధుమేహం అనేది చాలామందిని వేధించే జబ్బు. ఇది ఎవరికి వస్తుంది? అనే విషయం ముందుగా తెలిస్తే తగు జాగ్రత్తలు ముందుగా తీసుకునేందుకు వీలుంటే ఈ జబ్బు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ విషయంలో అమెరికా వాండర్‌బిల్ట్ హార్ట్, వాస్క్యులర్ ఇన్‌స్టిట్యూట్, మసాచ్చుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు సుమారు 12 ఏళ్లపాటు శ్రమించి ఒక బయోమార్కర్‌ను గుర్తించారు. ఈ బయోమార్కర్‌తో మధుమేహం వచ్చే అవకాశాన్ని పదేళ్ల ముందుగానే అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు పలువురు మధుమేహ బాధితులు, ఆరోగ్యవంతులైన వారిపైన పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో ప్రాథమిక రక్త నమూనా నుండి 2`అమైనోఅడిపిక్ ఆసిడ్ అనే ఒక కొత్తరకం బయోమార్కర్‌ను గుర్తించామని, ఇది మధుమేహం బారినపడే వారిలోనే అధికంగా కనిపిస్తోందని, మిగిలినవారిలో లేదని ఈ పరిశోధనలో పాల్గొన్న థామస్ వాంగ్ చెబుతున్నారు.