: జగన్ కేసులో మరో రెండు చార్జ్ షీట్లు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఇందూ, లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారాలపై ఈ ఛార్జ్ షీట్లను హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు సమర్పించింది. వీటిలో రాష్ట్ర మంత్రి జె.గీతారెడ్డిపై అభియోగాలు మోపింది. వివరాల్లోకెళితే.. ఇందూ సంస్థ జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఇందుకు ప్రతిఫలంగా అనంతపురం జిల్లాలో నాలెడ్జ్ హబ్ పేరిట ఇందూ గ్రూప్ కు 8,848 ఎకరాలు, శంషాబాద్ లో ఇందూ టెక్ జోన్ కు 250 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించింది. ఈ వివరాలన్నింటిని సీబీఐ చార్జ్ షీటులో పొందుపరిచింది. ఇందూ ప్రాజెక్టుకు భూ కేటాయింపు వ్యవహారంలో మాజీమంత్రి సబిత, పార్థసారథి, ఐఏఎస్ అధికారి రత్నప్రభపై అభియోగాలు నమోదు చేసింది. అందులో జగన్, విజయసాయి, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఇందూ పేర్లను పేర్కొంది.
అటు లేపాక్షి వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఛార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ అభియోగాలు కూడా నమోదు చేసింది. ఈ చార్జ్ షీటులో ఐఏఎస్ శ్యాంబాబు, శామ్యూల్, బీపీ ఆచార్య పేర్లను పేర్కొంది.