: ఇదో వెరైటీ థర్మామీటర్
థర్మామీటర్ దేనికి ఉపయోగిస్తాము... శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇదే థర్మామీటర్ మన శరీర ఉష్ణోగ్రతతోబాటు రక్తనాళాల సంకోచ, వ్యాకోచాల తీరును తెలియజేయడంతోబాటు శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతను అందజేస్తే... అది ప్రత్యేకమైన థర్మామీటర్‌గా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేకమైన థర్మామీటర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పైన చెప్పుకున్న ప్రత్యేకతలతోబాటు ఈ థర్మామీటర్‌కి వున్న మరో ప్రత్యేకతేమంటే దీని ఆకారం. ఇది అత్యంత పలుచనైన థర్మామీటర్.
అమెరికా, చైనా, సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒక థర్మామీటర్‌ను అభివృద్ధి పరచారు. ఈ థర్మామీటర్ అత్యంత పలుచనైన స్టిక్కర్‌లాగా ఉంటుంది. దీన్ని ఒక ప్రత్యేకమైన జిగురు లాంటి పదార్థంతో రోగి శరీరానికి అతికిస్తారు. ఇది రోగి శరీర ఉష్ణోగ్రతను లెక్కించి తెలియజేయడంతోబాటు, రక్తనాళాల సంకోచ, వ్యాకోచాల తీరును కూడా తెలియజేస్తుందట. ఈ థర్మామీటర్‌తో ఉన్న మరో ప్రయోజనం ఏమంటే దీన్ని వ్యతిరేక దిశలో కూడా చర్మానికి అతికించుకోవచ్చు. దీనివల్ల శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతను ఇది అందజేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.