: రూ. 100 కోట్ల 'మహాభారత్' నేటి నుంచి ప్రసారం


వంద కోట్లు పెట్టి సినిమా తీయడం చూశాం. ఒక సినిమా వంద కోట్లు వసూలు చేయడం కూడా చూశాం. కానీ, ఒక టెలివిజన్ సీరియల్ ని వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే.... ఏంటి నమ్మలేకపోతున్నారా? ఇది నిజమేనండీ... మన టెలివిజన్ సీరియల్స్ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయ్. భారతదేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రూ. 100 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన మెగా సీరియల్ 'మహా భారత్' ఈ రోజు (సెప్టెంబర్ 16) నుంచి స్టార్ ప్లస్ లో ప్రసారం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8.30 గంటల నుంచి అరగంట పాటు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. మొత్తం 128 ఎపిసోడ్ లు ప్రసారం చేయనున్నారు.

దూరదర్శన్ లో రెండు దశాబ్దాల క్రితం మహాభారత్ ప్రసారమయింది. అప్పట్లో అది వీక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆధునిక హంగులతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ సీరియల్ నిర్మాణానికి అక్షరాల వంద కోట్లు ఖర్చు చేశారు. దీనికి తోడు మార్కెటింగ్ కోసం మరో రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఈ సీరియల్ ను సిద్దార్థ్ కుమార్ తివారీకి చెందిన 'స్వస్తిక్ ప్రొడక్షన్స్' నిర్మించింది. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే విధంగా ఇందులో గ్రాఫిక్స్ ఉంటాయని స్టార్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

ఈ సీరియల్ ను భారీగా ప్రమోట్ చేసే పనిలో భాగంగా... 8 నగరాల్లోని షాపింగ్ మాల్స్ లో మహాభారత్ మ్యూజియంలను ఏర్పాటు చేశారు. సీరియల్ లోని వివిధ పాత్రధారులు వినియోగించిన ఆభరణాలు, వస్త్రాలు, ఆయుధాలను ఇందులో ప్రదర్శనకు ఉంచారు.

ఇక ఈ సీరియల్ మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల నుంచి భారీగా చార్జి వసూలు చేయనున్నారు. 10 సెకండ్ల యాడ్ కు రూ. 2 లక్షల ధర నిర్ణయించారు.

  • Loading...

More Telugu News