: మోడీపై జైరాం రమేశ్ వాగ్బాణాలు
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ వాగ్బాణాలు సంధించారు. ఆయనో నిరంకుశ నాయకుడని విమర్శించారు. 'దేశంలోని ఓ రాజకీయనేత తానిది చేశాను, అది చేశాను అని అలుపుసొలుపు లేకుండా చెప్పుకుంటారు. ప్రతిసారి 'నేను' అన్న పదం ఉపయోగించాల్సిందే. ప్రపంచమే ఇతనితో మొదలై ఇతనితోనే అంతం అవుతుందన్న రీతిలో మాట్లాడతారు' అని తూర్పారబట్టారు. అయితే, ఇక్కడ మోడీ పేరును ఉచ్చరించకుండా మంత్రి పరోక్షంగా మాట్లాడటం గమనార్హం. కానీ, రాహుల్ గాంధీ అలాకాదని, చేసే పనిని ఎంత నాణ్యంగా చేయవచ్చనేదే ఆలోచిస్తుంటారని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ తాను ఎవరినీ పొగడడం లేదన్న జైరాం... రాహుల్ ఎప్పుడూ అనవసరంగా, ఎవరిమీదా కోప్పడరన్నారు. అంతేకాక తన నిర్ణయాన్ని ఎవరిపైనా రుద్దరని, ఎదుటివారు చెప్పింది వింటారన్న మంత్రి, దేశంలో ప్రజలందరి సమస్యలు రాహుల్ తీర్చగలరంటూ ధీమా వ్యక్తం చేశారు.