: మోడీ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు: వెంకయ్య
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రావాలని అందరూ కోరుకుంటున్నారని బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎవరూ వ్యతిరేకించడంలేదని చెప్పారు. మోడీ ఐకమత్యాన్ని సాధించే వ్యక్తి అని వెంకయ్య అభివర్ణించారు. మోడీ పాలన గురించి చెబుతూ, గత పదేళ్ళుగా కనీసం ఒక్క గంటకూడా కర్ఫ్యూ విధించని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది గుజరాతేనని స్పష్టం చేశారు. దశాబ్దకాలంగా నిలకడగా పదిశాతం వృద్ధిరేటు సాధిస్తోందీ గుజరాతేనన్నారు. వర్షాలు తక్కువున్నా, వ్యవసాయరంగంలో పదిశాతం వృద్ధిరేటు నమోదు చేసిందన్నారు. ఈ ఘనత చూసి దేశ ప్రజలందరూ మోడీ వస్తే దేశం బాగుపడుతుందని భావిస్తున్నారని వెంకయ్య తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్పష్టమైన ఆధిక్యం వస్తేనే దేశంలో సంస్కరణలు తేవడానికి, సమస్యలను రూపుమాపడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. పాలకుల్లో నెలకొన్న నిష్క్రియాపరత్వం, అచేతనత్వం ప్రజలను అసహనానికి గురిచేస్తున్నాయని వెంకయ్య చెప్పుకొచ్చారు.