: కుంభ మేళాకు రూ.2812 కోట్లివ్వండి: మధ్యప్రదేశ్
2016లో ఉజ్జయిని నగరంలో జరగనున్న కుంభమేళా ఏర్పాట్ల కోసం రూ.2,812 కోట్ల ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ సర్కారు కేంద్రాన్ని కోరింది. కుంభమేళాకు నాలుగు నుంచి ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాకు లేఖ రాశారు. వీరి పుణ్యస్నానాలు, భద్రత తదితర ఏర్పాట్ల కోసం అంత మొత్తం నిధులు అవసరమవుతాయని తెలిపారు. ప్రతి 12 ఏళ్లకోసారి ఉజ్జయిని నగరం కుంభమేళాకు వేదికవుతుంది. దీనిని ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు వీలుగా ఉజ్జయిని మున్సిపల్ అధికారులు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు.