: అనిల్ అంబానీ అకౌంట్ హ్యాక్ చేసిన హైదరాబాద్ అమ్మాయి


ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ అకౌంట్ హ్యాక్ అయింది. హైదరాబాద్ కు చెందిన 21 ఏళ్ల సీఏ విద్యార్థిని... అంబానీకి చెందిన ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అంబానీ ఆదాయం, అతని ఆదాయ పన్ను వివరాలను తెలుసుకోవాలనే ఉత్సుకతతోనే ఆమె ఈ పని చేసిందని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆమెపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

అనిల్ అంబానీ అకౌంట్ ను హ్యాక్ చేసిన తర్వాత... అతని ఆదాయం, పన్నులు, పాన్ నంబరు వివరాలను ఆమె సేకరించింది. అంతే కాకుండా అతని ఈ-అకౌంట్ పాస్ వర్డ్ ను రెండుసార్లు మార్చింది.

జూన్ 26న ముంబై లోని అంబానీ వ్యక్తిగత పన్ను వివరాలను చూసే ఛార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీకి ఐటీ డిపార్ట్ మెంట్ నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. మీ రిక్వెస్టు ప్రకారం అకౌంట్ వివరాలు మార్చినట్టు అందులో ఉంది. ఇదే విధంగా జూలై 12న మరో ఈ మెయిల్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన 'అడాగ్' ప్రతినిధులు ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) కి ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోని దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. హైదరాబాద్ లోని మనోజ్ దాగా అండ్ కంపెనీ నుంచి అంబానీ అకౌంట్ హ్యాకింగ్ కు గురయిందని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడకు చేరుకుని... అందులో ఆర్టికల్ షిప్ చేస్తున్న విద్యార్థినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే చేశానని ఒప్పుకుంది. ఆ తర్వాత హ్యాకింగ్ చేసిన కంప్యూటర్ ను సీజ్ చేశారు. ఈ అమ్మాయి సైబర్ నేరానికి పాల్పడినట్టు తమ దగ్గర తగిన సాక్ష్యాలు ఉన్నాయని వారు తెలిపారు. హ్యాకింగ్ నేరానికి గాను ఆ అమ్మాయిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News