: మహిళలపై నేరాలకు మరణశిక్ష ముగింపు పలకలేదు: ఆమ్నెస్టీ
సంచలనం సృష్టించిన 'నిర్భయ' కేసులో ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును 'ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా' తోసిపుచ్చింది. మన దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు మరణశిక్ష ముగింపు పలకదని వ్యాఖ్యానించింది. ఇందుకు సుదూర విధానపరమైన, సంస్థాగత సంస్కరణలు అవసరమని చెప్పింది. ఆ సంస్థ డైరెక్టర్ తారా రావు మాట్లాడుతూ.. గత సంవత్సరం వైద్య విద్యార్ధినిపై జరిగిన ఘటన తీవ్రమైనదని, ఆమె కుటుంబానికి తన సంతాపం తెలుపుతున్నానన్నారు. అయితే, ఘటనకు పాల్పడిన దోషులను శిక్షించాల్సిందేనని, కానీ మరణశిక్ష అనేది సమాధానం కాదని తారా పేర్కొన్నారు. నలుగురు నిందితులను స్వల్పకాలంలో ఉరికి పంపి ఏం సాధిస్తామన్నారు.
లోతుగా పరిశీలిస్తే ఈ కేసులోని తీవ్రత అర్ధం చేసుకోవచ్చన్నారు. కానీ, నేరానికి మరణశిక్షే త్వరిత పరిష్కారంగా అధికారులు భావించకూడదన్నారు. మరణశిక్షే నేరానికి అడ్డుకట్టవేస్తుందని ఎక్కడా రుజువులేదని, మహిళలపై జరుగుతున్న దాడులకు ఈ శిక్ష ఏ విధంగానూ ఉపయోగపడదన్నారు. అయితే, ఇదే ఉత్సాహం, చైతన్యం పెండింగ్ లో ఉన్న మిగతా కేసులపైన కూడా అధికారులకు ఉండాలని కోరారు. ఇందుకోసం అవసరమైన జడ్జిలను నియమించాలని, అన్ని కేసుల్లోనూ ఇదే తరహా విచారణలు చేయాలని ఆమె సూచించారు.