: వారాంతంలో అగ్ని-5 క్షిపణి పరీక్ష
వాతావరణం అనుకూలిస్తే ఈ వారాంతంలో అగ్ని-5 క్షిపణిని పరీక్షించనున్నారు. భారత రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన అగ్ని-5ను ఆదివారం నాడు ఒడిశా తీరంలోని వీలర్ ఐలండ్ నుంచి ప్రయోగించే అవకాశాలున్నాయి. గత రెండేళ్లలో ఈ క్షిపణిని పరీక్షించడం ఇది రెండోసారి. మొట్టమొదటిసారిగా దీన్ని ఏప్రిల్ 2012లో పరీక్షించారు. అప్పుడు పరీక్ష విజయవంతం అయింది.
మన శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న అగ్ని-5 పరీక్షపై ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ దృష్టి సారించాయి. ఈ క్షిపణి 1.5 టన్నుల వార్ హెడ్ ను మోసుకుపోగలదు. దీని రేంజ్ 5,000 కిలోమీటర్లు. ఈ క్షిపణి చైనాలోని బీజింగ్, షాంఘై నగరాలనే కాక చైనా ఉత్తర దిక్కునున్న చిట్టచివరి నగరం హ్యాబిన్ ను కూడా తాకగలదు.
అగ్ని-5 క్షిపణి 17 మీటర్ల పొడవుతో 50 టన్నుల బరువుంటుంది. దీన్ని బాంబర్ల నుంచే కాకుండా, జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి మరో గొప్పదనం ఏంటంటే... న్యూక్లియర్ దాడి జరిగిన తర్వాత కూడా దీన్ని ప్రయోగించే వీలుండటం.
అగ్ని-5 ని 2017 సంవత్సరానికల్లా రక్షణ రంగానికి అందజేసే అవకాశాలున్నాయి. అయితే ఆ లోపుగానే దీన్ని మరికొన్నిసార్లు ప్రరీక్షించనున్నారు. ప్రస్తుతం మన దగ్గరున్న క్షిపణుల్లో అగ్ని-3 అత్యంత దూరం (3,500 కి.మీ) ప్రయాణించగలదు.