: 'ఈ-టికెట్' కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక యాప్
రైల్వే ప్రయాణం కోసం దేశంలో మరింతమంది ప్రజలు తేలికగా టికెట్ పొందేందుకు 'ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పోరేషన్' (ఐఆర్సీటీసీ) ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. నిన్న(గురువారం) న్యూఢిల్లీలో దీనిని ఐఆర్సీటీసీ విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ను విండోస్ ఫోన్, విండోస్ 8 ఆధారిత డివైస్ ల కోసం అందుబాటులో ఉంచామన్నారు. దాంతో, ప్రయాణికులు సులువుగా 'ఈ-టికెట్' ను బుక్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి ఈ యాప్ ను అభివృద్ధి చేసినట్లు ఐఆర్సీటీసీ సీఎండీ రాకేష్ టాండన్ తెలిపారు. ఈ ప్రత్యామ్నాయంతో ప్రయాణికులు సరికొత్త అనుభవాన్ని పొందుతారన్నారు. ఈ యాప్ ను విండోస్ ఫోన్, విండోస్ 8, టాబ్లెట్ పీసీ, లాప్ టాప్ ఉన్న వాళ్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ ద్వారా టికెట్ ను పొందుతున్న ప్రయాణికులకు మరో సౌలభ్యం కూడా అందించడం సంతోషంగా ఉందన్నారు.