: అభ్యర్థుల వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు : సుప్రీం కోర్టు


వందల కోట్ల ఆస్తులు వారి సొంతం. కానీ లెక్కల్లో మాత్రం వారికి సొంత కారు కూడా ఉండదు. బ్యాంకుల్లో కూడా కేవలం కొన్ని లక్షల రూపాయల బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. వారే మనం ఓటేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులు. అంతులేని అవినీతికి పాల్పడుతూ, దేశ సంపదను, పేదవాడి నోటి ముద్దను కొల్లగొడుతు వందలాది కోట్లను పోగేసుకుంటున్న ఇలాంటి వారిని మనం నెత్తిన పెట్టుకున్నా... దేశ అత్యున్నత న్యాయస్థానం మాత్రం ఉపేక్షించలేదు. వీరి విషయంలో కన్నెర్ర చేసింది. ఇకపై ఎలక్షన్లలో పోటీచేసే అభ్యర్థులు తాము సమర్పించే అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇవ్వరాదని హుకుం జారీచేసింది.

ఓటు వేసే ప్రజలకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి వివరాలను తెలుసుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు కుండ బద్దలుకొట్టింది. కాబట్టి అభ్యర్థులు తమ పూర్తి వివరాలను అఫిడవిట్ లో పొందుపరచాల్సిందేనని తెలిపింది. అలా చేయని అభ్యర్థులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టేనని హెచ్చరించింది. ఇలాంటి అభ్యర్థుల నామినేషన్ ను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ ఆఫీసర్ కు ఉంటుందని తెలిపింది.

తప్పుడు సమాచారం ఇచ్చే అభ్యర్థుల నామినేషన్ ను తిరస్కరించాలని... రీసర్జెన్స్ ఇండియా అనే స్వచ్చంద సంస్థ వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పోటీ చేసే అభ్యర్థి అఫిడవిట్ లో పేర్కొన్న ఏ ఒక్క కాలంను వదలరాదని స్పష్టం చేసింది. సమాచారం లేకపోతే నాట్ అప్లికబుల్ అని పేర్కొనాలని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు... రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పెను మార్పులు తీసుకురానుంది.

  • Loading...

More Telugu News