: ఎలాగైనా యాలకులు తీసుకొంటే మేలు
మన వంటకాల్లో సుగంధ దినుసులుగా వాడే వాటిలో చక్కటి వాసనను ఇచ్చేదిగా యాలకులను చెప్పవచ్చు. యాలకులను అవి, ఇవి అని కాకుండా చాలా వంటకాల్లో వాడుతుంటాం. స్వీట్స్ తయారుచేసినా కూడా వాటికి కాస్తంత యాలకుల వాసన తగలాల్సిందే. అప్పుడే ఆ స్వీట్స్ మరింత కమ్మగా ఉంటాయి. అయితే యాలకులు కేవలం సువాసననివ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
యాలకులను ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం వల్ల ఇవి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయట. ఇలాంటి సమస్యలకు యాలకులు అల్లంలాగా పనిచేసి సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కడుపులో వికారం, కడుపు ఉబ్బరంగా ఉండడం, ఆకలి మందగించడం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు యాలకులను వాడితే మంచి ఫలితం ఉంటుందట. మన శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను తొలగించడంలో యాలకులను మించినది మరోటి లేదని నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసనను తగ్గించడంతోబాటు నోటి అల్సర్లు, ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే క్రమేపీ ఇవి తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యాలకుల్లో పీచు పదార్ధం ఉంటుంది. అందువల్ల వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలాగే జలుబూ, దగ్గూ లాంటి సమస్యలున్నప్పుడు యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుముఖం పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.