: మీ పిల్లలు బాగా చదవాలంటే...
మీ పిల్లలు బాగా చదవాలంటే వారిని ఎంతసేపూ చదవమంటూ వెంటపడకుండా వారిచేత చక్కటి వ్యాయామం చేయిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. మన పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఏ తల్లిదండ్రులకు మాత్రం ఉండదు. ఇందుకోసం పిల్లల్ని అదేపనిగా చదవమంటూ సతాయిస్తుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని, పిల్లలకు చక్కటి శారీరక వ్యాయామం కూడా ఉండాలని, అప్పుడే వారి మెదడు మరింత చురుగ్గా పనిచేయగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పిల్లలచేత క్రమం తప్పకుండా వ్యాయామం చేయించడం వల్ల వాళ్లు చదువులో చక్కటి ప్రతిభ కనబరుస్తారని చెబుతున్నారు. వ్యాయామం అనేది పిల్లల జ్ఞాపకశక్తికి పదునుపెడుతుందని, వారి ప్రతిభా సామర్ధ్యాలు పెరుగుతాయని, ఏరోబిక్స్ చేసిన 9 నుండి 10 ఏళ్ల వయసు పిల్లల్లో ఈ మెరుగుదల స్పష్టంగా కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు. తాము నిర్వహించిన పరీక్షల్లో వ్యాయామాలు చేసిన పిల్లలే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని, వ్యాయామం చేయని పిల్లలతో పోల్చుకుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన పిల్లలు అధిక ప్రతిభ కనబరిచారని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఎంతసేపూ చదవమంటూ పిల్లల వెంటబడకుండా వారు చక్కగా ఆడుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించి, వారిచేత కాస్త వ్యాయామం చేయిస్తే చాలు. మీ పిల్లలు మంచి ప్రతిభ కనబరుస్తారు!