: రామ్ గోపాల్ వర్మకు ఐటీ సెగ
దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయిలోని అంధేరిలో ఉన్న రెండు కార్యాలయాల్లో నిన్న (బుధవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10.30 గంటలవరకు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది గంటలపాటు జరిగిన సోదాల్లో తమకెలాంటి రికార్డులు దొరకలేదన్నారు. అయితే, ఈ సమయంలో జరిగిన విచారణలో వర్మ చెప్పిన విషయాలనే రికార్డ్ చేశామన్నారు.
దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రిప్టు రచయితగా కొనసాగుతున్న వర్మ ఇంతవరకు సర్వీస్ ట్యాక్స్ కు సంబంధించి పేరును రిజిస్టర్ చేసుకోలేదన్నారు. అంతేగాక, ఇటీవల పన్ను చెల్లించని 132 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపామని, వాటిలో వర్మ పేరులేదన్నారు. దాంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు అకస్మాత్తుగా వర్మ ఇంటి తలుపుతట్టారు. 2008 నుంచి తన సినిమాలు ప్లాప్ అవుతుండటంతో పన్ను చెల్లించకుండా ఉండేందుకు వర్మ తన ప్రొడక్షన్ హౌస్ ను ముంబయి నుంచి హైదరాబాద్ కు తరలించినట్లు అధికారులు భావిస్తున్నారు.