: రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి: అశోక్ బాబు
సభలు, సమావేశాలు, విధుల బహిష్కరణతో విభజనకు నిరసన తెలుపుతున్న ఏపీఎన్జీవోలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈ మేరకు రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. ఆమోదకరమైన ప్రకటన వచ్చేవరకూ సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. సమ్మెను తీవ్రతరం చేసే విషయంపై ఈనెల 16 తర్వాత సమావేశమై చర్చిస్తామన్నారు. అయితే, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీపరమైన కమిటీలతో చర్చలు జరపబోమన్న అశోక్ బాబు సీమాంధ్ర ఎంపీలందరూ సోనియాను కలిసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. కాగా, కొంతమంది పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే సమాచారం తమకుందని, అవసరమైనప్పుడు ఈ విషయాన్ని బయటపెడతామనీ ఆయన అన్నారు. ఇక అత్యవసర సేవల విషయంలో మినహాయింపునివ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కోరామన్నారు.