: మోడీ ప్రధాని అభ్యర్ధిత్వానికి ఒప్పుకోనన్న అద్వానీ!
మోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి ఆ పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అడ్డుతగిలారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోననీ, అందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. మోడీ విషయంపై అద్వానీని ఒప్పించేందుకు నిన్న పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇదే విషయంపై రేపు నిర్వహించే పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో మోడీకి తన వ్యతిరేకత తెలుపుతానని రాజ్ నాథ్ తో చెప్పినట్లు సమాచారం. పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా మోడీ పేరు ప్రకటించడంవల్ల 'విపత్తు' వచ్చే ప్రమాదం ఉందని, 2014 ఎన్నికల్లో పార్టీ అవకాశాలు నాశనం అవుతాయని అన్నట్లు తెలిసింది. మొదటినుంచీ మోడీని అంగీకరించని సీనియర్ నేత ఇన్నాళ్లకు తన ఆలోచనను బహిర్గతం చేశారని చెప్పవచ్చు.