: నానో సూక్ష్మదర్శిని!
సూక్ష్మదర్శిని అంటే అతి చిన్న వస్తువులను మన కంటికి చూపించేదిగా చెబుతాం. అయితే ఆ సూక్ష్మదర్శినే చిన్నదిగా ఉంటే... ఇక మనమేం చూస్తాం అనుకుంటున్నారా... అయినా అది చక్కగా త్రీడీ చిత్రాలను తన కటకంతో మనకు చూపిస్తుంది. అలాంటి బుల్లి సూక్ష్మదర్శినిని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ బుల్లి సూక్ష్మదర్శిని ఎంత చిన్నది అంటే సూదిలో దూరిపోయేంత చిన్నదన్నమాట!
ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఇంజెక్షన్ చేసే సూదిలో దూరిపోయేంత చిన్న సూక్ష్మదర్శినిని రూపొందించారు. ఇది మిల్లీమీటరులో మూడో వంతు వైశాల్యం మాత్రమే ఉండే అతిచిన్న కటకంతో పనిచేస్తుంది. ఇది 3డీ దృశ్యాలను బంధించగలుగుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించే 'లంకెప్టమీ' శస్త్రచికిత్సలో చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శస్త్రచికిత్స సమయంలో కొన్ని కేన్సర్ కణాలు వైద్యుల కంటపడకుండా తప్పించుకుంటాయి. అలాంటివాటికోసం మళ్లీ ఆపరేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి బాధలేకుండా శస్త్రచికిత్స చేసే సమయంలోనే ఈ సూక్ష్మదర్శిని ఇలా దాక్కున్న కణాలను స్పష్టంగా చూపిస్తుందని, దీనితో పూర్తిగా క్యాన్సర్ కణాలను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని భవిష్యత్తులో మెదడు, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సకు కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.