: పాక్ ఐఎస్ఐ అధికారులు కాపీ రాయుళ్లు
పాకిస్థాన్ అంటే ప్రపంచానికి ఓ 'ప్రత్యేక గౌరవం'! ఎందుకంటే అక్కడ అక్రమాలు,అరాచకాలే రాజ్యమేలుతాయి. దీనికి అక్కడి పాలకులు, మత ఛాందసులు ఎవరూ అతీతులు కారు. ఇక ప్రభుత్వ వ్యవస్థలలో అది మరింత ఎక్కువ. అందుకే పాక్ అంటే ప్రపంచానికి 'ప్రత్యేక గౌరవం'. అలాంటి పాకిస్థాన్ లో నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ(ఎన్.ఎ.సి.టి.ఎ) 130 ఖాళీలను భర్తీ చేసేందుకు ఓ పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో దాయాదులు తమ ఇంటెలిజెన్స్ అంతా చూపించారు. ఎలాగనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. ఈ పరీక్షలో దాదాపు 500 మంది పాల్గొన్నారు. వీరిలో ఓ 50 మంది ఐఎస్ఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఉన్నారు. వీరంతా కాపీరాయుళ్లే.
పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునేందుకు వీరంతా మొబైల్స్ ను ఆశ్రయించారు. సమాధానాలు ఇంటర్ నెట్ లో బ్రౌజ్ చేస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. 500 మంది అభ్యర్థులకు కేవలం పది మంది ఇన్విజిలేటర్లు ఉండడం గమనార్హం. దీంతో పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ దొరికిపోయారు సదరు అధికారులు. అయితే అభ్యర్థులే కాదు ఇన్విజిలేటర్లు కూడా అక్రమార్కులే కావడం విశేషం.
ఇన్విజిలేటర్లు కొంత మంది అభ్యర్థులకు సాయం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే పరీక్షలో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని ఎన్.ఎ.సి.టి.ఎ సమన్వయ కర్త హైదర్ అలీ ఒప్పుకున్నారు. కానీ పరీక్ష పత్రాలు ఆలస్యంగా అందాయని అందుకే ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ లో జవాబులు వెతుక్కున్నారని అన్నారు. ఇదీ పాకిస్థాన్ లో పరీక్షలు జరిగే తీరు!