: మన్మోహన్ సింగ్ 'దుర్బలుడు': న్యూయార్క్ టైమ్స్ పత్రిక
భారతదేశ ఆర్ధిక సంక్షోభం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ అనుసరిస్తున్న తీరుపై అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది మన్మోహన్ విఫల ప్రధాని అంటూ 'టైమ్స్ మ్యాగజైన్' పేర్కొంటే, ఇప్పుడు మన్మోహన్ సింగ్ 'దుర్బలుడు' అంటూ 'న్యూయార్క్ టైమ్స్' వ్యాఖ్యానించింది. ఆయన ఆర్ధికవేత్తే అయినా ఎంతమాత్రం దేశ స్థితిగతులను పట్టించుకోరంటూ విశ్లేషించింది. తొమ్మిదేళ్ల యూపీఏ పాలనలో వెలుగుచూసిన కుంభకోణాలు గడ్డు పరిస్థితిని తీసుకొచ్చాయని చెప్పింది.
భారతదేశ ఆర్ధిక స్థితిగతుల గురించి ఆదివారం విడుదల చేసిన తాజా సంచికలో సంపాదకీయం ప్రచురించింది. దేశం ప్రస్తుతం సంక్షోభం దిశగా సాగుతుందని, ఇందుకు మన్మోహన్ చొరవ తీసుకోవాలని తేల్చి చెప్పింది. అయితే, కాంగ్రెస్ లో పెత్తనమంతా సోనియాగాంధీ చేతిలో ఉన్నందున మన్మోహన్ ఏదైనా చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించింది. దాంతో, డమ్మీగా మిగిలిన ప్రధానమంత్రి, బొమ్మలా ఆడిస్తున్న సోనియా, దేశ ఆర్ధిక స్థితి గురించి ఏమాత్రం అవగాహనలేని కాంగ్రెస్ వల్లనే భారత్ ఆర్ధిక రుగ్మతల పాలైందని తేటతెల్లం చేసింది.
'భారత ఆర్ధిక పరిస్థితి గత దశాబ్దకాలంలో దిగజారింది. సగటు వృద్ధిరేటు 7.7 నుంచి 4.4 శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు మందగించిన మాట వాస్తవం. అయినా భారత ఆర్ధిక పతనానికి దేశీయ స్థితిగతులే ప్రధాన కారణాలు' అంటూ కుండబద్దలు కొట్టింది న్యూయార్క్ టైమ్స్ పత్రిక. ప్రధానంగా ఇటీవల కాలంలో భారత్ పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్న పత్రిక, వచ్చే ఎన్నికల వరకు సోనియా, మన్మోహన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని నిర్మొహమాటంగా చెప్పింది. అంతేగాక 'యూపీఏ-2' హయాంలో బయటపడ్డ కుంభకోణాలతో వచ్చిన సమస్యలను వివరణాత్మకంగా పత్రిక పేర్కొంది.