: రాతతో రోగాన్ని గుర్తించవచ్చు
చేతి రాతతో కొందరు మన భవిష్యత్తును చెబుతారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో చెప్పలేంకానీ... మన చేతి రాతతో భవిష్యత్తులో మనకు వచ్చే రోగాన్ని గురించి నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నవారు భవిష్యత్తులో పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడతారా లేదా అనే విషయాన్ని వారి చేతి రాత ద్వారా చెప్పేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వీరు నిర్వహించిన అధ్యయనాల్లో పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి ముందుగానే ఈ రోగాన్ని వారి చేతి రాతలో గుర్తించవచ్చని తేలింది.
పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిన తర్వాత చాలాకాలానికి దాన్ని గుర్తించడం జరుగుతుంది. హైఫా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ సారా రోసెంబ్లమ్ మాట్లాడుతూ పార్కిన్సన్స్ వ్యాధి బాధితుల్లో కదలికలకు సంబంధించిన సమస్యలకన్నా ముందుగానే మానసికపరమైన సామర్ధ్యాల్లో మార్పులు వస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ వ్యాధిని ముందుగానే పసిగట్టేందుకు ఒక నిర్ధిష్టమైన, సరళమైన పద్ధతిని శాస్త్రవేత్తలు రూపొందించారు. వ్యక్తుల చేతిరాతలో మార్పుల్ని గమనించడం ద్వారా వారిలో వ్యాధిని త్వరగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా వరకూ అధ్యయనాలన్నీ చేతిరాత పరిశీలనతో బాధితుల కదలికలకు సంబంధించిన నైపుణ్యాలపైనే దృష్టి సారించారు. అంతేతప్ప మానసికపరమైన సామర్ధ్యాలను పరిశీలించలేదు. అయితే ఈ పరిశోధనలో బాధితుల చేతి రాతపై మానసికపరమైన ప్రభావం పడుతున్నట్టు గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడానికి, రోగనిర్ధారణ జరగడానికి చాలా ఏళ్లముందే వారి చేతి రాతలో మార్పులు సంభవించడం వల్ల, వాటిని గుర్తించి, వ్యాధి తొలిదశలోనే దాన్ని గుర్తించి, నివారణకు తగు చికిత్స అందించే వీలు కలుగుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న రోసెంబ్లమ్ చెబుతున్నారు.