: ధృవాల్లోని అద్భుతాల చిత్రణ
ధృవప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఒక అధ్భుత దృశ్యం అరోరాలు. ఆకాశంలో చక్కటి చిత్రకారుడు కుంచెతో రంగులను చక్కగా కుమ్మరించాడా అన్నట్టుగా కనిపించే అద్భుతమైన దృశ్యం ఈ అరోరా బొరియాలిస్. ఇలాంటి అద్భుతాన్ని డిజిటల్ కెమెరాతో చిత్రీకరించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేసి, సఫలీకృతులయ్యారు. ధృవాల్లోని అరోరాలను డిజిటల్ కెమెరాల్లో చిత్రీకరించారు.
జపాన్‌లోని టోక్యోలోని జాతీయ ధృవ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాల్లో ఏర్పడే అరోరాలను, వాటి ఎత్తును తెలుసుకోవడానికి డిజిటల్ కెమెరాలను ఉపయోగించారు. చేపకన్నులా పనిచేసే రెండు సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ (ఎస్‌ఎల్‌ఆర్) డిజిటల్ కెమెరాలను ఉపయోగించి ఈ అరోరా బొరియాలిస్ ఎఫెక్ట్‌కు చెందిన త్రీడీ చిత్రాలను సేకరించి, వాటితో ఈ కాంతి ఎత్తును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిశోధన గురించి ఇందులో పాల్గొన్న రైహూ కటోక మాట్లాడుతూ ఈ చిత్రాలను తొలుత ప్లానెటోరియంలో ప్రదర్శించి సఫలమయ్యామని, ఈ త్రీడీ చిత్రాలతో వాటి ఎత్తును కొలవగలమని చెప్పారు. కటోక జపాన్ హయమలోని గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌తోకూడా కలిసి పనిచేస్తున్నారు. సూర్యుడినుండి వచ్చిన కాంతి ధృవ ప్రాంతంలోని వాతావరణంలో ఎలక్ట్రాన్స్‌తో విచ్ఛిన్నమై ఇలా రంగురంగుల అరోరాలుగా కనిపిస్తాయి. వీటినే ధృవ ప్రభలని కూడా అంటారు.