: మాపై పథకం ప్రకారమే దాడి: అశోక్ బాబు
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ముగిసిన వెంటనే బస్సుల్లో సీమాంధ్ర ప్రాంతానికి వెళుతున్న ఏపీఎన్జీవోలపై హైదరాబాదు శివార్లలో ఓ పథకం ప్రకారమే దాడి చేశారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. రాజధానిలోని ఏపీఎన్జీవో భవన్లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించిన కొందరు వ్యక్తులు బైక్ లపై బస్సులను వెంబడించారని, రాళ్ళతో బస్సులపై దాడి చేశారని వివరించారు. ఈ దాడిలో పలువురు ఉద్యోగులకు తీవ్రగాయాలయ్యాయని అశోక్ తెలిపారు. రాళ్ళదాడిలో 4 బస్సులు ధ్వంసంకాగా, 5 బస్సులకు అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు.
జై ఆంధ్రా అంటూ నినాదాలు చేస్తూనే వారు బస్సులపై రాళ్ళు విసిరినట్టు అశోక్ వెల్లడించారు. దాడులకు పాల్పడిన వాళ్ళను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరుతున్నామన్నారు. కాగా, కొందరు రాజకీయనాయకులు తెలంగాణ వారిపై సమైక్యవాదులు దాడి చేశారని చెప్పడం బాధాకరమని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. సభపైకి చెప్పులు విసిరిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారొచ్చి ఆ వ్యక్తిని సభ నుంచి బయటికి తీసుకెళ్ళారని వివరించారు. మరో సంఘటనలో విద్యార్థినేతను కొట్టామంటూ వచ్చిన ఆరోపణల్లో నిజంలేదన్నారు. ఈ రెండు సంఘటనలను చూపిస్తూ జరగరానిదేదో జరిగిపోయినట్టు కొందరు రాజకీయనాయకులు అదేపనిగా ప్రచారం చేయడం దారుణమని దుయ్యబట్టారు.
ఇక రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో భవిష్య కార్యచరణను ఆయన వెల్లడించారు. అంతేగాకుండా, కేబినెట్ నోట్ అసెంబ్లీ ముందుకు రావాల్సిందేనని ఉద్ఘాటించారు. విభజన అంశంలో ఎమ్మెల్యేలు అందరూ ఒక్కతాటిపై నిలవాలని సూచించామని ఈ ఉద్యోగ నేత తెలిపారు. ఇరు ప్రాంతాల నేతలు కూర్చుని చర్చించుకుంటే ఈ సమస్యకు షరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.