: సచిన్ కోసం పాక్ స్పిన్నర్ సాయం కోరిన విండీస్
బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఫామ్ లో లేకున్నా అతడి క్లాస్ టచ్ పై ఎవరికీ అనుమానాల్లేవు. నవంబర్లో భారత్ లో పర్యటించనున్న విండీస్ కూడా సచిన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని భావిస్తోంది. 198 టెస్టులాడిన అనుభవశాలి సచిన్ ఫామ్ అందిపుచ్చుకోవడానికి పెద్దగా సమయం అక్కర్లేదన్న విషయం కరీబియన్ జట్టు యాజమాన్యానికి తెలియందికాదు. అందుకే సచిన్ తో పాటు ఇతర భారత స్టార్లను కట్టడి చేసేందుకు పాక్ మాజీ స్పిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ ను రంగంలోకి దింపింది. పేరెన్నికగన్న భారత బ్యాట్స్ మెన్ ను గతంలో సక్లాయిన్ పలు సందర్బాల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఈ ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకున్న విండీస్ బోర్డు సక్లాయిన్ ను స్పిన్ బౌలింగ్ కోచ్ గా నియమించింది. ప్రస్తుతం బార్బడోస్ జరుగుతున్న హైపెర్ఫార్మెన్స్ కోచింగ్ క్యాంపులో సక్లాయిన్ విండీస్ స్పిన్నర్లను సానబడుతున్నాడు.
కాగా, భారత్ లో విండీస్ టూర్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు జరగనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, రెండు టెస్టులు జరుగుతాయి. సచిన్ తన 200వ టెస్టుకు కేవలం రెండు మ్యాచ్ ల దూరంలో ఉన్న సంగతి తెలిసిందే. మాస్టర్ సొంతగడ్డపైనే ఈ చారిత్రక మ్యాచ్ ఆడేందుకు వీలుగా బీసీసీఐ ఈ స్వల్ప కాలిక షెడ్యూల్ ను ప్రకటించినట్టు క్రికెట్ వర్గాలంటున్నాయి.