: సిరియాపై సైనిక చర్యకు యూరోపియన్ యూనియన్ మద్దతు
సిరియాపై యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 28 యూరోప్ దేశాల కూటమి 'యూరోపియన్ యూనియన్' సిరియాపై సైనిక చర్యకు అధికారికంగా మద్ధతు ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ లూథేనియా దేశంలోని విల్ నిస్ నగరంలో యూరోపియన్ దేశాల విదేశాంగ మంత్రులతో జరిపిన రాయబారం ఫలించింది. సమావేశం అనంతరం సహచర యూరోపియన్ దేశాల విదేశాంగ మంత్రులతో కలిసి యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ కేథరీన్ ఆస్టన్ మీడియాతో మాట్లాడారు. పౌరులపై సిరియా రసాయనిక దాడిపై స్పష్టమైన, బలమైన సమాధానం ఇస్తే చూడాలనుకుంటున్నామంటూ ప్రకటించారు. రసాయనిక దాడిపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు బృందం త్వరగా నివేదిక ఇవ్వాలని కేథరీన్ కోరారు.
సిరియాపై సైనిక చర్యకు ఇప్పటికే ఫ్రాన్స్ అమెరికాకు మద్దతు పలికింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా మద్దతు పలకడం విశేషం. పరిమిత సైనిక చర్యకు ఉద్దేశించిన తీర్మానం ఈ వారంలో అమెరికా చట్ట సభల ముందుకు వస్తుంది. అక్కడ ఆమోదం లభించడం ఆలస్యం అమెరికా విమానాలు సిరియాపై బాంబులు కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. సిరియాపై అమెరికా సైనిక చర్యకు దిగితే క్రూడాయిల్ ధరలు భగ్గుమంటాయి. ఇప్పటికే మాంద్యంతో సతమతమవుతున్న ప్రపంచ దేశాలకు నిస్సందేహంగా ఇది పిడుగుపాటే.