: రైల్వేలో రూ.50వేల కోట్ల కుంభకోణం!


యూపీఏ పాలనలో మరో కుంభకోణాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెలుగులోకి తెచ్చింది. కామన్వెల్త్, 2జి, బొగ్గు కుంభకోణాల తర్వాత.. ఇప్పుడు రైల్వేలో రవాణాకు సంబంధించి సుమారుగా 50 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు కన్నం పడిందని తెలుస్తోంది. 2008లో రైల్వే శాఖ ఐరన్ ఓర్ (స్టీల్ తయారీ ముడి సరుకు) రవాణాకు రెండు రకాల చార్జీల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దేశీయ వినియోగం కోసం రవాణా చేసే ఐరన్ ఓర్ కు తక్కువ చార్జీ ఉంటే, విదేశాలకు ఎగుమతి చేసే ఐరన్ ఓర్ రవాణాకు మూడు రెట్లు అదనంగా రవాణా చార్జీని రైల్వే నిర్ణయించింది. అయితే, ఐరన్ ఓర్ ఎగుమతి దారులు ఈ రెండు రకాల రేట్ల విధానాన్ని స్వలాభం కోసం దుర్వినియోగం చేశారు. ఎగుమతి చేసే ఐరన్ ఓర్ ను దేశీయ వినియోగంగా చూపి రవాణా చార్జీలను భారీగా ఎగవేసినట్లు బయటపడింది. ఇలాంటి పలు కేసులపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో కాగ్.. రైల్వే శాఖకు చెందిన 75 లోడింగ్ పాయింట్లకు గాను 26 చోట్ల పత్రాలను ఆడిట్ చేసింది. దీంతో 17వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు బయటపడింది. మిగతా చోట్ల కూడా ఆడిట్ చేస్తే ఈ మొత్తం 50వేల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఎగుమతి దారులు రవాణా చేసే ఐరన్ ఓర్ ను దేశీయ వినియోగమని చెబితే సరిపోదు. అందుకు ఆధారాలుగా అఫిడవిట్ సహా కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎగుమతి దారులు వీటిని కూడా సరిగా సమర్పించలేదని కాగ్ ఆడిట్ లో తేలింది. అంటే రైల్వే అధికారులు ఎగుమతిదారులతో కలిసి ఖజానాకు తూట్లు పొడిచినట్లు స్పష్టమవుతోంది.

  • Loading...

More Telugu News