: సమైక్యానికి మద్దతుగా రగులుతోన్న సీమాంధ్ర
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో మహిళలు, అధికారులు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారు రోడ్డుమీద తాడాట ఆడుతూ రాస్తారోకో చేశారు. దీంతో కాకినాడ, రాజమండ్రి రోడ్డుపై కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక అనంతపురం జిల్లా విషయానికొస్తే... జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలు 40వ రోజుకు చేరుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రజలు, ఉద్యోగులు... నిరంతరాయంగా, స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. రెవెన్యూ, విద్యుత్, ఎన్జీవో, జెడ్పీ, జాక్టో, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ రోజు అనంతపురంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. పామిడిలో సమైక్యవాదులు బెంగళూరు జాతీయరహదారిని దిగ్బంధించారు. ఏపీఎన్జీవోల సభకు వెళ్లిన వారిపై దాడిని నిరసిస్తూ... వీరు ఆందోళన చేపట్టారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉరవకొండలో సమైక్యవాదానికి మద్దతుగా అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు జిల్లాలో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్లపై బైఠాయించారు. రాష్ట్రాన్ని విడగొట్టకుండా సమైక్యంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఇక, కడపలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.