: ఉట్టి కొట్టే కార్యక్రమంపై బోంబే హైకోర్టులో పిల్


శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున యువతీ, యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టడానికి పోటీ పడుతుంటారు. వీధిలో అంతెత్తున కుండలో పెరుగు నింపి తాడుకి వేలాడ దీస్తే.. దాన్ని అందుకుని బద్దలు కొట్టడానికి యువతీ యువకులు ఉత్సాహం చూపిస్తుంటారు. పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు ఎక్కి ఉట్టి కొట్టడాన్ని చూసే ఉంటారు. ఇంతటి సరదా, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ఉట్టి కొట్టే (దహి హ్యాండి) కార్యక్రమాన్ని క్రీడగా ప్రకటించి, నియంత్రణలు విధించాలని కోరుతూ బోంబే హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని క్రీడగా ప్రకటించి నియంత్రించాలని, ఇందుకోసం మార్గదర్శకాలు రూపొందించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ ఇజాజ్ నఖ్వి (న్యాయవాది) కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం కొన్ని రోజులలో విచారణకు రానుంది. ఉట్టి కొట్టడాన్ని నిర్దేశిత ప్రాంతానికే పరిమితం చేయాలని కోరారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిని చట్టప్రకారం విచారించాలని అభ్యర్థించారు. ఉట్టి కొట్టడం కోసం పిరమిడ్ లా ఒకరిపై ఒకరు ఎక్కే సయమంలో కొందరు గాయపడుతున్నారని పిటిషన్ లో ఆరోపించారు. శిక్షణ లేకుండా చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే జట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రమాదాలు జరుగుతున్నందున ఉట్టికొట్టడాన్ని నియంత్రించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News