: కాశ్మీర్లోని పలు జిల్లాలలో కర్ఫ్యూ
దక్షిణ కాశ్మీర్లోని పలు ప్రాంతాలు మరోసారి కర్ఫ్యూ నీడలోకి వెళ్లాయి. షోపియాన్, కుల్గామ్ జిల్లాలలోని పలు ప్రాంతాలలో ఈ రోజు కర్ఫ్యూ విధించారు. షోపియాన్ జిల్లాలోని గగన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై కొందరు యువకులు నిన్న దాడికి దిగారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పులలో నలుగురు ఆందోళనకారులు మరణించారు. దీంతో హింస, ఆందోళనలు రేగడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా షోపియాన్, జైనాపోరా, కుల్గామ్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం సాధారణ పోలీసులకు తోడుగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా సున్నిత ప్రాంతాలలో రంగంలోకి దిగాయి. కాల్పులలో మరణించిన ఒక వ్యక్తికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్లో భద్రతా దళాల క్యాంపులపై ఇటీవలి కాలంలో తరచుగా దాడులు జరుగుతున్నాయి. వేర్పాటు వాదులు, ఉగ్రవాదులు అశాంతి రేకెత్తించేందుకని స్థానిక యువకుల వెనకనుండి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.