: మాల్దీవుల ఎన్నికల్లో కొద్దిలో విజయాన్ని మిస్సయిన నషీద్


మాల్దీవుల అధ్యక్ష స్థానానికి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయారు. నషీద్ కు 45 శాతం ఓట్లు వచ్చాయి. 50 శాతానికి మించితేనే అధ్యక్ష కిరీటం సొంతం అవుతుంది. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న ఇతర అభ్యర్థులలో అబ్దుల్ ఖయ్యూమ్ కు 25 శాతం, ఖాసిం ఇబ్రహీంకు 24 శాతం, మొహమ్మద్ వహీద్ హస్సాన్ కు 5 శాతం ఓట్లు లభించాయి. స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వల్ల తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈ నెల 28న మళ్లీ పోలింగ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నషీద్ 2008లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, నషీద్ అక్రమాలకు పాల్పడ్డారంటూ మొహమ్మద్ వహీద్ ఆయనను బలవంతంగా పదవీచ్యుతుడిని చేసి అధ్యక్ష పీఠం ఎక్కారు. దీంతో నషీద్ భారత రాయబార కార్యాలయంలో శరణు పొందిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో మాల్దీవుల ప్రజల్లో 45 శాతం మంది నషీద్ కు మద్దతు తెలుపగా, వహీద్ కు కేవలం 5 శాతం మందే ఓటేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News