: ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు.. 11 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో ఇరు మతవర్గాల మధ్య నిన్న జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతిచెందారు. నిన్న 9 మంది మృతి చెందగా, 34 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తుండగా ఈ ఉదయం మరో ఇద్దరు ప్రాణం విడిచారు. మరణించిన వారిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నా, అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు.
గత కొన్ని వారాలుగా ముజఫర్ నగర్ లో ఈవ్ టీజింగ్ కార్యకలాపాలు పెరిగిపోయాయి. వీటిని అడ్డుకునేందుకు ఒక మతం వర్గం వారు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. ఇందులో కొందరు వ్యక్తులు ముజఫర్ నగర్ శివారు గ్రామస్థులతో ఘర్షణకు దిగారు. అనంతరం ఈ గ్రూప్ పట్టణంలోకి రాగా వీరిపై దాడి జరిగింది. ఇదే ఘర్షణలకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఏడాది కాలంగా రాష్ట్రంలోని 22 జిల్లాలలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ జిల్లాలు కర్ఫ్యూ నీడలోకి కూడా వెళ్లాయి. సమాజ్ వాదీ పార్టీ మత సామరస్యాన్ని సమాధి చేస్తుందనడానికి ఇవే నిదర్శనాలని పలువురు అంటున్నారు.