: తెలంగాణ అమాయక ఆడపిల్ల.. ఆంధ్ర గడుసు కుర్రాడు..
అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ ప్రవచించిన విషయాలను 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభా వేదికపై ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ గుర్తు చేశారు. నిజామాబాద్ లో జరిగిన ఓ సభలో నెహ్రూ మాట్లాడుతూ.. తెలంగాణ అనే అమాయక ఆడపిల్లను ఆంధ్రా అనే గడుసు కుర్రాడికిచ్చి పెళ్ళి చేస్తే ఇరుప్రాంతాలు ఒక్కటై సుఖ జీవనం సాధ్యమవుతుందని చెప్పారని అశోక్ వివరించారు. అయితే, ఎప్పుడైనా భేదాభ్రిపాయాలు వస్తే విడిపోవచ్చని కూడా ఆయన చెప్పారన్నారు. కానీ, వివాహం చేసిన వాళ్ళెవరూ విడిపోవాలని కోరుకోరని అశోక్ పేర్కొన్నారు. 69లో ముల్కీ నిబంధనల పేరిట తెలంగాణ.. 72లో ఆంధ్ర విడిపోవాలని కోరుకున్నా.. దేశానికి అత్తగారు వంటి ఇందిరాగాంధీ ఇరు ప్రాంతాలవారిని పిలిచి సఖ్యంగా ఉండాలని సూచించారని తెలిపారు. ఇక ఆ దంపతులిద్దరూ పెళ్ళి చేసుకున్న అనంతరం హైదరాబాద్ మహానగరంలాంటి కొడుకును కన్నారని ఆ తెలంగాణ ఆంధ్ర దంపతులకు పుట్టిన బిడ్డే హైదరాబాదు మహానగరం అని అశోక్ వివరించారు.
అతగాడు పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తర్వాత.. కొందరు తెలంగాణకు ఆంధ్ర నుంచి విడిపోవాలని సూచించారని.. 72లోనే అతడు (ఆంధ్రా) విడిపోవాలని కోరుకున్నాడు కదా.. అంటూ తెలంగాణకు నూరిపోశారని పేర్కొన్నారు. తీరా కొడుకు ప్రయోజకుడైన సమయంలో అతడు తల్లివద్దనే ఉండాలంటే, ఆ తండ్రి పరిస్థితి ఏంకావాలని అశోక్ ప్రశ్నించారు. దీంతో సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి.