: పుణెలో రోబో డ్యాన్స్ హంగామా
రోబోలు ఏం చేస్తాయి. చిట్టి చిట్టి పనులు చేస్తాయని మాత్రమే తెలుసు. కానీ, రోబో సినిమాలో 'చిట్టి'లా చిందులు వేయడం నిజ ప్రపంచంలో ఎప్పుడూ చూసి ఉండరు. కాస్త ఓపిక చేసుకుని వినాయక చవితి రోజు పుణె నగరానికి వెళితే రోబో డ్యాన్స్ ను తెగ ఎంజాయ్ చేయవచ్చు. ఒకటి రెండు కాదు 40 రోబోలు హిట్ సాంగ్స్ కు స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఊర్రూతలూగించడానికి రెడీ అయ్యాయి. అంతేకాదు సూర్య నమస్కారాలు, యోగాసనాలను కూడా వేసి ఔరా అనిపించనున్నాయి.
సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9 నుంచి 18 వరకు పుణెలో సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాటరీ ద్వారా పనిచేసే రోబోలను చైనా, బ్రిటన్, వియత్నాం, తైవాన్ దేశాల నుంచి తెప్పించి వాటితో చిందులు, ఆసనాలు వేయించేలా సుహాస్ నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం ప్రోగ్రామ్ సిద్ధం చేసింది. గంటపాటు 40 రోబోలు డ్యాన్స్ తో హంగామా చేయనున్నాయని సుహాస్ మీడియాకు తెలిపారు. అంతే కాదండోయ్ పండగ సంబరాలు అయిన తర్వాత రోబోలను తీసుకుని ఇంజనీర్ల బృందం విదేశాలలో పర్యటించనుంది. రోబోలతో యోగాసనాలను వేయిస్తూ వాటి గొప్పతనాన్ని చాటి చెప్పనుంది.