: కొలీజియం వ్యవస్థకు చరమగీతం
దేశంలో ఇప్పటివరకు సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు చేపట్టిన కొలీజియం వ్యవస్థకు చరమగీతం పాడారు. ఇకనుంచి న్యాయ నియామకాల సంఘం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఓకే చెప్పినా, కొన్ని సవరణలు అవసరమంటూ ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో సభలో మిగిలిన సభ్యుల్లో 131 మంది మద్దతు తెలపగా ఓ సభ్యుడు వ్యతిరేకించారు. అంతకుముందు బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మాట్లాడుతూ, కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలను గుర్తించామని, న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వ్యవస్థకూ చోటు ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు.
కొలీజియం వ్యవస్థను అనుసరించి ఇప్పటివరకూ న్యాయమూర్తులను న్యాయమూర్తులే ఎంపిక చేస్తూ వచ్చారు. ఇకపై న్యాయ నియామకాల సంఘం ఈ బాధ్యతను స్వీకరించనుంది. ఈ సంఘంలో సభ్యులను ప్రధాన మంత్రితో పాటు లోక్ సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలిసి ఎంపిక చేస్తారు. ఈ సంఘం చేసిన సిఫారసుల ఆధారంగానే సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల ఎంపిక, బదిలీలపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, కొలీజియం వ్యవస్థను 2003లోనే రద్దు చేయాలని అప్పటి ఎన్డీయే ప్రభుత్వం భావించినా విఫలమైంది.