: ఆనాడు సోనియా చెప్పిందే నేనీనాడు చెబుతున్నా: ఉండవల్లి
రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో ఇందిరా గాంధీ చెప్పిన విషయాలనే నిన్న పార్లమెంటులో చెప్పానని.. తాజాగా కొందరు సోనియా చెప్పిన విషయాలను ఎందుకు ప్రస్తావించరని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వారందరికీ జవాబిచ్చేముందు, 2009 ఫిబ్రవరి 28న సోనియా హైదరాబాదు సభలో ఏం చెప్పారో తెలుసుకోవాలని సూచించారు. ఆ సభలో సోనియా ప్రసంగానికి తానే అనువాదకుడనని, ఆమె ప్రసంగ పాఠం మొత్తం తనకు ముందే తెలుస్తుందని చెబుతూ.. ఆ ప్రసంగం ముగిస్తూ ఆమె 'జై ఆంధ్రప్రదేశ్' అన్నారని ఉండవల్లి తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 'జై ఆంధ్రప్రదేశ్' అన్నా గానీ అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ కే తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారని వివరించారు.
ఇక ఎపీఎన్జీవోలు రేపు హైదరాబాదులో చేపడుతున్న సభ విషయంలోనూ ఉండవల్లి స్పందించారు. ఏపీఎన్జీవోల సభను ఎవ్వరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టేవ్యాఖ్యలతో ఏం సాధిస్తారని తెలంగాణ వాదులను ప్రశ్నించారు. తామేం తలచితే అదే జరగాలని వారు భావించడం తగదని హితవు పలికారు. ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర విభజన సాధ్యమని వారు గుర్తెరగాలని ఈ కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు.