: బలవంతపు సంసారానికి మీ భార్యలు ఓకే చెబుతారా?: కాంగ్రెస్ ఎంపీలు
సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. 'బలవంతపు సంసారానికి మీ భార్యలు ఒప్పుకుంటారా?' అని ప్రశ్నిస్తూ.. 'అసలా బంధాన్ని ఏమంటారో మీ భార్యలనడగండి' అని సూచించారు. ఢిల్లీ ఏపీ భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ విస్పష్ట ప్రకటన చేశాక కూడా రాష్ట్ర విభజన ప్రకటన జరగదని ఉండవల్లి, లగడపాటి చెబుతుండడం హాస్యాస్పదమన్నారు. వారి వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు.
దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు సీమాంధ్ర ఎంపీలు వ్యవహరిస్తున్నారని, వారివి దొంగనాటకాలని వ్యాఖ్యానించారు. ఇక సీఎం కిరణ్ పై విమర్శలు చేశారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతినివ్వడం ద్వారా సీఎం రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులంతా రాష్ట్ర విభజనకు మద్దతివ్వాలని వారు స్పష్టం చేశారు.