: పాముని మింగబోయిన కప్ప
పాము కప్పని మింగడం మామూలే... కానీ కప్ప పాముని మింగిందని ఎవరైనా చెబితే ఛా.. నిజమా అంటాం. అక్కడితో ఆగకుండా బ్రహ్మంగారు ఏమైనా చెప్పారా? అని తరచి చూసుకోవడం మామూలే. తాజాగా ఇదే వింత సిద్ధిపేటలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఓ పామును మింగడానికి కప్ప విశ్వప్రయత్నం చేసింది. భారీ పరిమాణంలో ఉన్న గోధురు కప్ప దాదాపు రెండు అడుగుల పొడవున్న పామును దాదాపు సగం మింగేసింది. ఈ క్రమంలో అది గింజుకోవడంతో అక్కడ అలజడి ఏర్పడింది. దీంతో కప్ప పామును విడిచిపెట్టింది. బ్రతుకు జీవుడా అంటూ పాము పరుగుతీసింది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని కళాశాల జీవశాస్త్ర విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.