: ఇక్కడ సభను అడ్డుకుంటే ఢిల్లీలో తెలంగాణవాదానికి బ్రేక్ వేస్తాం: అశోక్ బాబు
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు అనుమతి, తదనంతర పరిణామాలపై మీడియా ఎదుటకు వచ్చారు. ఈనెల 7న తలపెట్టిన సభ నిర్వహణ కోసం తాము చాలా క్రమశిక్షణతో శాంతియుతంగా వ్యవహరిస్తున్నామని, దయచేసి రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. సభకు అన్ని వర్గాల వారిని అనుమతించాలని కోరామని, కానీ, అనుమతించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు పెట్టిన సభకు కేవలం తెలంగాణ ఉద్యోగులే వచ్చారా? అని ప్రశ్నించారు.
కొందరు సభకు ఎవరూ రాకుండా అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారని.. హైదరాబాదులో సభను అడ్డుకుంటే ఢిల్లీలో తెలంగాణ వాదానికి ఎలా బ్రేక్ వేయాలో తమకు తెలుసని అశోక్ బాబు హెచ్చరించారు. విమానాశ్రయంలో రన్ వే క్లియర్ గా ఉంటేనే విమానం ల్యాండవుతుందని.. రన్ వే క్లియర్ గా లేకపోతే అటునుంచి అటే ఎగిరిపోతుందని వివరించారు. తెలంగాణ రాష్టం పరిస్థితీ ఇంతేనని చెప్పారు. సభను సజావుగా నడవనీయకుంటే తెలంగాణ వాదంలో పసలేదని భావించాల్సి ఉంటుందని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.
ఇక, తాము నిబంధనల ప్రకారమే సభ జరుపుకునేందుకు ఎల్బీ స్టేడియం కోసం దరఖాస్తు చేసుకున్నామని.. అయితే, స్టేడియం అధికారుల వైఖరి అసంబద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. సభా ప్రాంగణాన్ని ముందుగానే అప్పగించడం కుదరదని అధికారులు చెబుతున్నారని.. సభావేదికను అప్పటికప్పుడు అప్పగిస్తే ఏర్పాట్లు ఎలా చేసుకుంటామని అశోక్ ప్రశ్నించారు. సభ ఏర్పాట్లకు సహకరించకపోతే పోలీసులు, ఎల్బీ స్టేడియం అధికారులదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.