: నోరు నొక్కే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు: ఉండవల్లి
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి వివరిస్తుంటే తనను అడ్డుకున్నారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం దేశంలోకెల్లా అతిపెద్ద ఉద్యమం అని తాను చెబుతుండగానే, టీ-కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారని వివరించారు. నోరు నొక్కే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఉండవల్లి హెచ్చరించారు.
తన 'వాయిస్' ముందు వారి 'నాయిస్' వినపడదనే వారు ఇలాంటి చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను మాట్లాడే విషయాలను వినడమే ఇష్టం లేనట్టుగా వ్యవహరించారని, ప్రజస్వామ్యంలో వాదోపవాదాలతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని, వారా విషయం మరిచినట్టున్నారని విమర్శించారు. అయినా, విభజన ప్రక్రియ ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ తీర్మానం, పార్లమెంటులో చర్చ, ఓటింగు, ఆమోదం వంటి ప్రక్రియలు మిగిలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందరి సమ్మతి ఉంటేనే విభజన విషయంలో అడుగుముందుకు పడుతుందని అన్నారు.