: కాంగ్రెస్ దొంగ.. రాజ్యమేలుతోంది, జాగ్రత్తగా ఉండాలి: బాబు
కాంగ్రెస్ దొంగ.. రాజ్యమేలుతోందని, జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు ప్రజలను హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న బాబు అమరావతి వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సోనియా కుమారుడు రాహుల్ ఓ మొద్దబ్బాయని, ఆయనను పీఎం చెయ్యాలని సోనియా.. విజయమ్మ కుమారుడు జగన్ ఓ దొంగబ్బాయని, అతడిని సీఎం చెయ్యాలని విజయమ్మ ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ కు ప్రజలు శంకరగిరి మాన్యాల గతి పట్టిస్తారని బాబు అన్నారు. తెలుగుజాతి మధ్య చిచ్చుబెట్టి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని విమర్శించారు. రాష్ట్ర విభజన ఓ జగన్నాటకమైతే అందుకు కాంగ్రెస్ పార్టీ సూత్రధారి అని టీఆర్ఎస్ పాత్రధారి అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇక ప్రధాని మన్మోహన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ప్రధాని అసమర్థ పాలన వల్ల 120 కోట్ల మంది జనాభా బాధపడుతున్నారని దుయ్యబట్టారు. యూపీఏ పాలనలో దేశం దివాలా తీసిందని, అదే సమయంలో అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. సోనియా, ప్రధాని వల్ల అభివృద్ధి ఆగిపోయి, అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.