: విభజన ఆపాలనుకుంటే అది విఫలయత్నమే: డీఎస్
పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ మరోసారి మీడియా ముందుకొచ్చారు. హైదరాబాదులో ఈ సాయంత్రం మాట్లాడుతూ, ఈ తరుణంలో విభజన ప్రక్రియను ఆపాలనుకుంటే అది విఫలయత్నమే అవుతుందని అన్నారు. విభజన ప్రకటనపై కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోదని, అన్నిస్థాయిల్లో చర్చలు జరిగాకే ప్రకటన చేశారని డీఎస్ వివరించారు. తెలంగాణ పోరాటం ఇప్పటిది కాదని ఐదు దశాబ్దాలుగా సాగుతోందని, తమ ఆకాంక్షను సీమాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలని డీఎస్ సూచించారు. తెలంగాణ వస్తే సీమాంధ్ర ఉద్యోగులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏపీఎన్జీవోలలో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఏపీఎన్జీవోలు చర్చలు జరిపి తమ అనుమానాలను తీర్చుకోవచ్చన్నారు.