: వందేళ్లుగా నాలుగంగుళాలే పెరిగారట!
వందేళ్ల నుండి పురుషులు నాలుగు అంగుళాలు పొడవు పెరిగారని పరిశోధకులు చెబుతున్నారు. వంద సంవత్సరాల క్రితం పురుషుల ఎత్తుతో, ఇప్పుడు పురుషుల ఎత్తును పోల్చుకుంటే వందేళ్ల క్రితం నాటి పురుషుల ఎత్తుకన్నా కూడా నాలుగంగుళాలు ఎత్తు ఎక్కువగా పెరిగారని ఐరోపాలో జరిపిన ఒక తాజా అధ్యయనంలో తేలింది.
ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రొఫెసర్ తిమోతి హాటన్ ఆధ్వర్యంలో 15 ఐరోపా దేశాల్లో 1870 నుండి 1980 దాకా పురుషుల జనన సరళులను గురించి పరిశోధకులు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో పురుషులు వందేళ్లక్రితం నాటి ఎత్తుతో పోల్చితే నాలుగు అంగుళాలు అధికంగా పెరిగినట్టు తేలింది. 19వ శతాబ్దం మధ్యనుండి 1980ల నాటికి ఐరోపా పురుషులు సగటున 11 సెంటీమీటర్లు పెరిగినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాధులకు సంబంధించి వాతావరణం మెరుగవడం, ఫలితంగా శిశు మరణాల రేటు తగ్గడం వంటివి పురుషుల ఎత్తు పెరిగేందుకు ఉపకరించాయని పరిశోధకులు చెబుతున్నారు.